Wednesday, 1 July 2020

🌻. కఠోపనిషత్ - 7 🌻

🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 10 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కఠోపనిషత్  -  7 🌻

🌷. తృతీయవల్లి  / చతుర్థవల్లి 🌷


17. య ఇమం పరమం గుహ్యం
శ్రావయేత్ బ్రహ్మ సంసది!
ప్రయత: శ్రాద్ధకాలే వా
తదానంత్యాయ కల్పతే !!
తదానంత్యాయ కల్పత ఇతి!!

అత్యంత గోప్యమైన ఈ కథను బ్రాహ్మణ సభలో గానీ, శ్రాద్ధకర్మ చేసే సమయంలోగానీ, పరమభక్తితో వినిపించినవాడు అనంతమైన ప్రతిఫలాన్ని పొందగలడు.

🌷. చతుర్థవల్లి 🌷

1. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ
స్తస్మాత్ పరాఙ్ పశ్యతి నాంతరాత్మన్ !
కశ్చిద్ధీర: ప్రత్యగాత్మానమైక్ష
దావృత్తచక్షుక మృతత్వమిచ్ఛన్ !!

స్వత: సిద్ధుడు స్వయంగా ఆవిర్భవించినవాడు అయిన భగవంతుడు ఇంద్రియాలను దోషపూరితులుగా సృష్టించాడు. అందుచేత అవి బయటి విషయాలవైపు మాత్రమే పోగలవు. లోపల వున్న ప్రత్యగాత్మను అవి దర్శించలేవు. ప్రయత్నంతో ఎవరో ఒక ధీరుడు అమృతత్వాన్ని కోరి తన కళ్లను లోపలికి మరల్చుతాడు. అంతరాత్మను దర్శిస్తాడు.

2. పరాచ: కామాననుయంతి బాలా
స్తే మృత్యోర్యంతి వితతస్య పాశమ్ !
అథ ధీరా అమృతత్వం విదిత్వా
ధ్రువమధ్రువేష్విహ న ప్రార్థయంతే !!

పసిబాలురు బాహ్యసుఖాల వెంటపడతారు. అలా వారు అపారమైన మృత్యువు వలలో పడిపోతారు. కానీ ప్రాజ్ఞులు ఈ అనిత్య విషయాలమధ్య నిత్యం, శాశ్వతం, అమరమూ అయినది ఏదో తెలుసుకుని ఈ ప్రపంచంలో దేనిని కూడా కోరరు.

3. యేన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంశ్చ మైథునాన్!
ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వై తత్!!

రంగూచ రుచీ, వాసనలనూ, శబ్ద స్పర్శలను మైథున సంయోగాలను మానవుడు ఏ ఆత్మచేత తెలుసుకుంటున్నాడో ఆ ఆత్మకు తెలియంది ఈ ప్రపంచంలో ఏముంది? ఇదే నువ్వు తెలుసుకోగోరిన ఆ ఆత్మ.

4. స్వప్నాంతం జాగరితాంతం చోభౌ యేనానుపశ్యతి!
మహాంతం విభూమాత్మానం మత్వా ధీరో న శోచతి!!

స్వప్నావస్థలో జాగ్రదవస్థలో అన్ని విషయాలనూ ఏ ఆత్మ ద్వారా మానవుడు దర్శిస్తాడో.. మహత్తరమూ, సర్వవ్యాపీ అయిన ఆ ఆత్మను సాక్షాత్కరించుకుని ప్రాజ్ఞుడు ఇక దు:ఖించడు.

5. య ఇమం మధ్వదం వేద
ఆత్మానం జీవమంతికాత్!
ఈశానం భూత భవ్యస్య న తతో
విజుగుప్సతే ఏతద్వైతత్ !!

తేనెను ఆస్వాదిస్తున్నది, జీవితాన్ని పోషిస్తున్నది, భూతభవిష్యత్తులకు ప్రభువూ అయిన ఆత్మను చాలా దగ్గరగా తెలుసుకున్నవాడు ఆ తరువాత భయం చెందడు. నిజంగా ఇదే ఆ ఆత్మ.

6. య: పూర్వం తపసో జాత
మద్భ్య: పూర్వమజాయత!
గుహాం ప్రవిశ్య తిష్ఠంతం యో
భూతేభిర్వ్య పశ్యత ఏతద్వై తత్ !!

పూర్వం జ్ఞానానికి జన్మించినవాడు, నీటికంటే ముందుగా జన్మించినవాడు అయినా అది హృదయంలో ప్రవేశించి పంచభూతాలతో వుంటున్నదని దర్శించినవాడు నిజంగా బ్రహ్మాన్నే దర్శిస్తాడు. నిజంగా ఇదే ఆ ఆత్మ.

7. యా ప్రాణేన సంభవత్యది
తిర్దేవతా మయీ!
గుహాం ప్రవిశ్య తిష్ఠంతీం యా భూతే
భిర్వ్య జాయత ఏతద్వై తత్ !!

ప్రాణరూపంలో కనబడేది, పంచభూతాలతో సృష్టించబడింది, హృదయంలో ప్రవేశించి నివసించే ఆత్మని, దేవతల ఆత్మను తెలుసుకొన్నవాడు బ్రహ్మాన్నే తెలుసుకుంటాడు. నిజంగా ఇదే ఆ ఆత్మ.

8. అరణ్యోర్నిహితో జాతవేదా గర్భ
ఇవ సుభృతో గర్భిణీభి:!
దివే దివ ఈడ్యో జాగృవద్భిర్హ
విష్మద్భిర్మనుష్యేభిరగ్ని: ఏతద్వై తత్!!

గర్భవతులైన తల్లులవల్ల రక్షించబడి, పోషించబడే గర్భంలాగా... మండే కర్రలలో జాగ్రత్తగా వుంచబడిన సర్వజ్ఞుడైన అగ్నిదేవుడు ప్రబోధితులైన వారిచేతా, యజ్ఞకర్తలచేతా ప్రతిదినం ఆరాదింపబడతాడు. నిజంగా ఇదే అది.

9. యతశ్చోదేతి సూర్యో అస్తం యత్రచ గచ్ఛతి!
తం దేవా: సర్వే ర్పితాస్తదునాత్యేతి కశ్చన! ఏతద్వై తత్ !!

సూర్యుడు దేనినుండి ఉదయిస్తూ, అస్తమిస్తాడో.. అందులోనే సకలదేవతలూ అమర్చబడి వున్నారు. నిజంగా ఎవరుగానీ దానిని అతిక్రమించగలరు. నిజంగా ఇదే ఆ ఆత్మ.

10. యదేవేహ తదముత్ర యదము్ర తదన్విహ!
మృత్యో: స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి!!

ఇక్కడ వున్నదే అక్కడా వుంది. అలాగే అక్కడ వున్నది ఇక్కడా వుంది. ఇక్కడ అన్యంగా వుందని చూసేవాడు... మళ్లీమళ్లీ అటువంటివారికి జనన, మరణాలు తప్పవు.

11. మనసైవేదమాప్తవ్యం నేహ నానా స్తి కించన!
మృత్యో: స మృ త్యుం గచ్ఛతి య ఇహ నానేవ పశ్యతి!!

మనస్సు ద్వారానే దీన్ని సాక్షాత్కరించుకోవాలి. అప్పుడే ఇక్కడ ఏ వైవిధ్యమూ వుండదు. ఇక్కడ వైవిధ్యం వున్నట్లు చూసేవాడు మరణం నుంచి మరణానికి పోతూ వుంటాడు. అటువంటివారికి జనన, మరణాలు తప్పవు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment