Wednesday, 1 July 2020

🌻. కఠోపనిషత్ - 8 🌻

🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 11 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కఠోపనిషత్  -  8 🌻


🌷. చతుర్థవల్లి / పంచమవల్లి 🌷

12. అంగుష్ఠమాత్ర: పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి!
ఈశానో భూత భవ్యస్య న తతో విజుగుప్సతే! ఏతద్వై తత్ !!

బోటనవ్రేలి పరిమాణంగల పురుషుడు ఈ శరీరంలో నివసిస్తూ వుంటాడు. భూత, భవిష్యత్తులకు ఆయనే ప్రభువు. ఇది తెలిసి మానవుడు భయపడడు. ఇదే ఆ ఆత్మ.

13. అంగుష్ఠమాత్ర: పురుషో జ్యోతిరివాధూమక:!
ఈశానో భూతభవ్యస్య స ఏవాద్య స ఉ శ్వ: ! ఏతద్వై తత్ !!

బొటనవ్రేలి పరిమాణం గల పురుషుడు భూత, భవిష్యత్తులకు ప్రభువు. ఆయన పొగేలేని జ్యోతి. ఇవాళా, రేపూ కూడా ఆయన ఒకలాగే వుంటాడు. నిజంగా ఇదే ఆత్మ.

14. యథోదకం దుర్గేవృష్టం పర్వతేషు విధావతి !
ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తానేవాను విధావతి!!

ఉన్నత శిఖరంపైన వర్షించిన నీరు పర్వత సానువులలో లెక్కలేని పాయలై ప్రవహించినట్లు.. గుణాలను వివిధాలుగా చూసేవాడు నిజంగా వాటివెంటే పరుగుతీస్తాడు.

15. యథోదకం శుద్ధే శుద్ధమాస్తికం తాదృగేవ భవతి!
ఏవం మునేరిజానత ఆత్మాభవతి గౌతమ!!

శుభ్రమైన నీరు, శుభ్రమైన నీటిలో పోయబడి శుభ్రంగానే వుంటుదో.. అలాగే ఆత్మ ఏకత్వాన్ని తెలుసుకున్న ఋషి ఆత్మ కూడా అవుతుంది.

🌷. పంచమవల్లి  🌷

1. పురమేకాదశద్వార మజస్యావక్ర చేతస: !
అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే ! ఏతద్వై తత్!!

జన్మరహితుడూ, అకుంఠిత ప్రజ్ఞావంతుడు అయిన ఆత్మకు పదకొండు ద్వారాలుగల పట్టణం వుంది. ఆ ఆత్మను ధ్యానించిన వారికి దు:ఖం లేదు. అన్ని అజ్ఞానబంధాలనుండి విముక్తుడై జన్మమృత్యుబంధాలనుండి కూడా స్వేచ్ఛ పొందుతాడు. ఇదే నిజంగా అది.

2. హంస: శుచిషద్ వసురంతరిక్షసద్
హోతా వేదిషదతిథిర్దురోణసత్!
నృషద్ వరసదృతసద్ వ్యోమసదబ్జాగోజా
ఋతజా అద్రిజా ఋతం బృహత్ !!

స్వర్గంలో తిరిగే సూర్యుడు ఆ ఆత్మ. అంతరాళంలో సంచరించే వాయువు ఆ ఆత్మ. యజ్ఞవేదికపైన అగ్నీ కూజాలోని అతిథీ (సోమరసం) ఆ ఆత్మే. మానవులలో, దేవతలలో, యజ్ఞంలో, ఆకాశంలో ఆ ఆత్మ వుంది. ఆ ఆత్మ నీటిలో జన్మించింది.. భూమిపై జన్మించింది.. యజ్ఞంలో జన్మించింది.. పర్వతంపై జన్మించింది. ఆ ఆత్మయే సత్యం. అదే బృహత్తు.

3. ఊర్థ్వం ప్రాణమున్న యత్యపానం ప్రత్యగస్యతి !
మధ్యే వామనమాసీనం విశ్వేదేవా ఉపాసతే !!

అతడు ప్రాణాన్ని పైకి పంపిస్తాడు. అపానాన్ని కిందికి విసురుతాడు. మధ్యలో ఆ సీనుడై వున్న ఆ ఆత్మను పూజనీయుని అందరు దేవతలూ ఆరాధిస్తారు.

4. అస్య విస్రంసమానస్య శరీరస్థస్య దేహిన: !
దేహాద్ విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే ! ఏతద్వై తత్ !!

శరీరంలో నివసించే వారికి చెందింది. శరీరంనుండి అతడు వేరు చేయబడిన తర్వాత ఇక్కడ ఏది మాత్రం మిగులుతుంది? ఇదే నిజంగా ఆ ఆత్మ.

5. న ప్రాణేన నపానేన మర్త్యో జీవతి కశ్చన !
ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా వుపాశ్రితౌ!!

మానవుడెవడూ ప్రాణం చేతగానీ, అపానం చేతగానీ జీవించడు. ఈ రెండూ ఆధారపడి వుండే మరొకదానిచేత జీవిస్తాడు. అదే ఆత్మ.

6. హంత త ఇదం ప్రవ్యక్ష్యామి గుహ్యం బ్రహ్మసనాతనమ్ !
యథా చ మరణంప్రాప్య ఆత్మాభవతి గౌతమ్!!

ఓ గౌతమా... ఇక నీకు ఆ రహస్యమూ, సనాతనమూ అయిన బ్రహ్మం గురించి చెబుతాను. అలాగే చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను.

7. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన: !
స్థాణుమన్యే నుసంయంతి యథాకర్మ యథాశ్రుతమ్!!

కొన్ని జీవాత్ములు శరీరంకోసం గర్భంలో ప్రవేశిస్తాయి. మరికొన్ని జీవాత్ములు చెట్టూ చేమలను ఆశ్రయిస్తాయి. అంతా వారివారి కర్మను అనుసరించి, జ్ఞానాన్ని అనుసరించి వుంటుంది.

8. య ఏషసుప్తేషు జాగర్తి కామం కామం పురుషోనిర్మిమాణ: !
తదేవ శుక్రంతద్ బ్రహ్మ తదేవామృతముచ్యతే !
తస్మింల్లోకా: శ్రితా: సర్వే తదునాత్యేతి కశ్చన! ఏతద్వై తత్ !!

మనం నిద్రించేటప్పుడు కూడా వివిధమైన వాంఛనీయ వస్తువులను నిర్మిస్తూ.. మేలుకుని వుండే ఆ పురుషుడే పరిశుద్ధమైన బ్రహ్మం. అదే అమరం అని కూడా చెప్పబడుతున్నది. అన్ని లోకాలూ వున్నది దానియందే. దానినెవరూ అతిక్రమించలేరు. ఇదే నిజంగా ఆత్మ.

9. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో
రూపంరూపం ప్రతిరూపో బభూవ!
ఏకస్తథా సర్వభూతాంతరాత్మా
రూపంరూపం ప్రతిరూపో బహిశ్చ!!

ఒకే ఒక అగ్ని ప్రపంచంలో ప్రవేశించి, అది మండించే పదార్థాన్ని పోలిన రూపాలనే ధరించినట్లు, అన్ని జీవులలోనూ వున్న ఒకే ఒక ఆత్మ తాను ప్రవేశించిన ఆయా వస్తువుల రూపాలనే ధరించి కనిపిస్తుంది. అంతేగాక వాటిని మించికూడా వుంటుంది.

10. వాయుర్యథైకో భువనం ప్రవిష్టో
రూపంరూపం ప్రతిరూపో బభూవ!
ఏకస్తథా సర్వభూతాంతరాత్మ
రూపంరూపం ప్రతిరూపో బహిశ్చ !!

ఒకే వాయువు ప్రపంచంలో ప్రవేశించి, వివిధ రూపాలకు పోలిన రూపాలను ధరిస్తుందో... అలాగే సకల జీవుల హృదయాల్లోనూ వున్న ఒకే ఆత్మ తాను ప్రవేశించిన వివిధ రూపాలులాగా వివిధంగా కనిపిస్తుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment