Wednesday, 1 July 2020

🌻. కఠోపనిషత్ - 3 🌻

🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 6 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కఠోపనిషత్  -  3 🌻

21. దేవైరత్రాపి విచికిత్సతం పురా
నహి సు విజ్ఞేయమణురేష ధర్మ: !
అన్యం వరం నచికేతో వృణీష్య
మా మోపరోత్సీరతి మా సృజైనమ్ !!

(యముడు ఇలా అన్నాడు) : ఈ విషయంలో దేవతలకు కూడా మునుపు సందేహం వచ్చింది. ఇది చాలా సూక్ష్మమైన విషయం. అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. అందుచేత ఓ నచికేతా మరొక వరం ఏదైనా కోరుకో.ఈ వరం మాత్రం నన్ను అర్థించకు. ఈ మాటనుండి నన్ను వదిలిపెట్టు.

22. దేవైరత్రాపి విచికిత్సితం కిల
త్వం చ మృత్యో యన్న సుజ్ఞేయమాత్థ !
వక్తా చాస్య త్వాదృగన్యో న లభ్యో
నాన్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్ !!

(నచికేతుడు ఇలా అన్నాడు) ఈ విషయంలో మరి దేవతలకు కూడా సందేహం వచ్చింది కదా! దానికితోడు ఈ విషయం సులభంగా అర్థమయ్యేది కాదని నువ్వుకూడా చెపుతున్నావు. ఈ విషయాన్ని వివరించడానికి నీతో సమానుడైన ఆచార్యుడు ఎక్కడా లభ్యంకాడు. అందుచేత ఈ వరంతో సమానమైన వరం మరేదీ లేదనే నేను అనుకుంటున్నాను.

23. బహూన్ పశూన్ హస్తిహిరణ్యమశ్వాన్ !
భూమేర్మహదాయతనం వృనీష్య
స్వయం చ జీవ శరదో యావదిచ్ఛసి!!

(యముడిలా అన్నాడు) నూరేళ్లు జీవించే కొడుకులనూ, మనుములనూ కోరుకో. పశువుల మందలనూ, ఏనుగులూ, గుర్రాలనూ, బంగారాన్నీ ఎంతైనా కోరుకో. భూమిమీద సువిశాల సామ్రాజ్యాన్ని వరించు. నువ్వు కూడా నీకిష్టమైనంత కాలం జీవించు.

24. ఏతతత్తుల్యం యది మన్యసే వరం
వృణీష్య విత్తం చిరజీవికాం చ !
మహాభూమౌ నచికేతస్త్వమేధి
కామానాం త్వా కామభాజం కరోమి!

దీనితో సమానమైన వరమేదైనా నీకు తోస్తే అదే కోరుకో. ధనమూ, దీర్ఘజీవనమూ కూడా కోరుకో. ఓ నచికేతా సువిశాల సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తిగా వుండు. నీకు కలిగే కోరికలన్నీ నెరవేరేలాగా నేను వరమిస్తాను.

25. యేయే కామా దుర్లభా మర్త్యలోకే
సర్వాన్ కామాన్ ఛందత: ప్రార్థయస్వ !
ఇమారామా: సరధా: సతూర్యా
న హీదృశా లాంభనీయా మనుష్వై: !!
ఆభిర్మ త్ర్ప త్తాభి: పరిచారయస్వ
నచికేతో మరణం మా నుప్రాక్షీ: !!

మానవ లోకంలో ఏఏ కోరికలు దుర్లభాలో వాటన్నిటినీ నీ ఇష్టప్రకారం అడుగు. సంగీత వాద్యాలతో విహార రథాలతో వున్న ఈ అపురూప సుందరులైన కన్యలు మానవులకు లభ్యం కాదు. వారందరినీ నేను నీకు ప్రసాదిస్తాను. వారి సేవలను పొందు. కానీ మరణాన్ని గురించి మాత్రం నన్ను అడుగవద్దు.

26. శ్వోభావా మర్త్యస్య యదంతకైతత్
సర్వేంద్రియాణాం జరయంతి తేజ: !
అపి సర్వం జీవితమల్పమేవ
తవైన వాహాస్తవ నృత్యగీతే !!

(నచికేతుడిలా అన్నాడు) ఓ యమరాజా నువ్వు చెప్పే ఇవన్నీ కూడా క్షణికాలే మానవుడి ఇంద్రియాల శక్తిని నశింపజేసేవే. ఎంత పొడిగించినా మానవుడి జీవితం అల్పమే. అందుచేత నీ గుర్రాలు, ఏనుగులు, ఆటపాటలు నువ్వే ఉంచుకో.

27. న విత్తేన తర్పణీయో మనుష్యో
లప్స్యామహే విత్తమ్రదాక్ష్మ చేత్త్వా !
జీవిష్యామో యావదీశిష్యసి త్వం
వరస్తు మే వరణీయ: స ఏవ !!

మానవుడేనాటికీ ధనంతో తృప్తిపడడు. అంతేగాక నిన్ను దర్శించాక మాకు ఎలాగూ సంపద లభిస్తుంది. నువ్వు విధించినంత కాలము ఎలాగూ జీవిస్తాం. కానీ మరణానంతరం వుండే అమోఘమైన జీవితం గురించిన జ్ఞానం నేను కోరే వరం.

 28. అజీర్యతా మమృతానాముపేత్య
జీర్యన్ మర్త్య: క్వధ: స్థ: ప్రజానన్ !
అభిధ్యాయన్ వర్ణరతిప్రమోదా
నతిదీర్ఘే జీవితే కో రమేత !!

అక్షయులూ, అమరులూ ఐన వారివద్దకు చేరుకుని వారివద్ద నుండి పొందగలిగే శ్రేష్ఠతమమైన వరాలను తెలిసికూడా ఆటపాటల ఆనందాన్ని పరిశీలించిన ఏ మర్త్యుడు వాటిలో దీర్ఘకాలం ఆనందించాలని ఇష్టపడతాడు?

29. యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో
యత్ సాంపరాయే మహతి బ్రూహి నస్తత్ !
యో యంవరో గూఢమనుప్రవిష్టో
నాన్యం తస్మాన్నచికేతా వృణీతే !!

ఓ యమరాజా మరణానంతరం వుండే ఆ పరమ జీవితాన్ని గురించి చెప్పు. దాన్ని గురించి అందరికి సందేహం గ్రహించనలవి కాని ఈ విషయం తప్ప నచికేతుడు మరొక వరం కోరడు.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment