🌹. వేద ఉపనిషత్ సూక్తములు - 9 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కఠోపనిషత్ - 6 🌻
🌷. తృతీయవల్లి :
1. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే
గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే!
ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి
పంచాగ్నయో యే చ త్రిణాచికేతా:!!
తమ పుణ్య కర్మఫలాన్ని అనుభవిస్తూ, పరమమైన హృదాకాశంలోని బుద్ధియందు ప్రవేశించినవారు ఈ లోకంలో ఇరువురున్నారు. బ్రహ్మవిదులు వానిని వెలుగునీడలని అంటారు. నాచికేత యజ్ఞాన్ని మూడుసార్లు చేసిన గృహస్థులు కూడా అలాగే అంటారు.
2. య: సేతురీజానానామక్షరం బ్రహ్మయత్ పరమ్!
అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి!!
3. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు!
బుద్ధింతు సారథిం విద్ధిం మన: ప్రగ్రహమేవ చ!!
ఆత్మ దాన్ని అధిరోహించిన యజమాని అని తెలుసుకో. అలాగే శరీరం రథము బుద్ధే సారథి మనస్సే కళ్లెమూ అని గ్రహించు.
4. ఇంద్రియాణి హయానా
హుర్విషయాంస్తేషు గోచరాన్!
ఆత్మేంద్రియ మనోయుక్తం
భోక్తేత్యాహుర్మనీషిణ: !!
ఇంద్రియాలే గుర్రాలూ.. ఇంద్రియ విషయాలే అవి పరుగుతీసే మార్గాలూ అని అంటారు. శరీరమూ, ఇంద్రియాలూ, మనస్సులతో కూడివున్న ఆత్మనే ప్రాజ్ఞులు భోక్తగా చెపుతారు.
5. యస్త్వ విజ్ఞానవాన్ భవత్య యుక్తేన మనసా సదా!
తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథే: !!
మనస్సును విచ్చలవిడిగా వదిలేసి సరైన జ్ఞానం లేకుండా ఎవరైనా, ఎల్లప్పుడూ సంచరిస్తే.. అలాంటివాని ఇంద్రియాలు దోషం వున్న గుర్రాలు సారథి అదుపుతప్పి పోయినట్లే వశం తప్పిపోతాయి.
6. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా!
తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథే: !!
అయితే ఎల్లప్పుడూ మనస్సును అదుపులో వుంచుకుని సరైన జ్ఞానం కలిగి ప్రవర్తించే వాని ఇంద్రియాలు సారథి గుర్రాల్లో వశంలో వుంటాయి.
7. యస్త్వ విజ్ఞానవాన్ భవత్య మనస్క: సదా శుచి:!
న స తత్ పదమాప్నోతి సంసారం చాధిగచ్ఛతి!!
సరైన జ్ఞానంలేక చెదిరిపోయిన మనస్సుతో ఎల్లప్పుడూ అశుచిగా వుండేవాడు ఆ గమ్యాన్ని పరమ పదాన్ని ఎన్నటికీ పొందలేడు. అంతేగాక జననమరణ చక్రరూపమైన సంసారంలో పడిపోతాడు.
8. యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్క: సదా శుచి:!
స తు తత్ పదమాప్నోతి యస్మాద్ భూయో న జాయతే!!
కానీ ఎవడైతే విజ్ఞానవంతుడో, వశం చేసుకున్న మనస్సు గలవాడో, సదా పరిశుద్ధుడో అతడు పునర్జన్మలేని ఆ పరమపదాన్ని చేరుకుంటాడు.
9. విజ్ఞాన సారథిర్యస్తు మన: ప్రగ్రహవాన్ నర: !
సో ధ్వన: పారమాప్నోతి తద్ విష్ణో: పరమం పదమ్!!
బుద్ధే సారథిగా గలవాడు, మనస్సే చాకచక్యంతో పట్టుకోబడిన కళ్లెమైనవాడు అయిన మానవుడు ప్రయాణపు గమ్యమైన విష్ణువు పరమపదాన్ని చేరుకుంటాడు.
10. ఇంద్రియేభ్య: పరా హ్యర్థా అర్థేభ్యశ్చ పరం మన:!
మనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా మహాన్ పర: !!
11. మహత: పరమవ్యక్తమవ్యక్తాత్ పురుష: పర: !
పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరా గతి: !!
ఇంద్రియాలకంటే వాటి విషయాలు శ్రేష్ఠమైనవి. విషయాల కంటే మనస్సు గొప్పది. మనస్సుకంటే బుద్ధి ప్రశస్తమైంది. బుద్ధి కంటే ప్రశస్తమైంది మహత్తు. అవ్యక్తం మహత్తుకంటే ఉత్కృష్టమైంది. అ అవ్యక్తాని కంటే కూడా పరమోత్కృష్టమైంది పురుషుడు. ఆ పురుషుని మించినది మరేదీ లేదు. అదే చరమసీమ. అదే పరమగమ్యం.
12. ఏషసర్వేషు భూతేషు
గూఢో త్మా న ప్రకాశతే!
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా
సూక్ష్మయా సూక్ష్మదర్శిభి: !!
అన్ని జీవులలోనూ గూఢంగా వున్న ఈ ఆత్మ అందరికీ ప్రకటితం కాదు. సూక్ష్మదర్శులైన ఋషులు మాత్రమే తీక్షణమైన ఏకాగ్రమైన తమ బుద్ధిద్వారా ఆ ఆత్మను షాక్షాత్కరించుకోగలరు.
13. యచ్చేద్ వాఙ్ మనసీ
ప్రాజ్ఞస్తద్యచ్చేద్ జ్ఞాన ఆత్మని!
జ్ఞానమాత్మాని మహతి నియచ్ఛేత్
తద్యచ్ఛేచ్ఛాంత ఆత్మని!!
ప్రాజ్ఞుడు వాక్కును మనస్సులోనూ, మనస్సును బుద్ధియందు, ఆ బుద్ధుని హిరణ్యగర్భునిలోనూ, ఆ హిరణ్యగర్భుని కూడా తుదకు పరమశాంతి అనే పరమాత్మయందూ క్రమంగా లయింపచేయాలి.
14. ఉత్తిష్ఠత జాగ్రత
ప్రాప్య వరాన్ నిబోధత !
క్షురస్యధారా నిశితా దురత్యయా
దుర్గం పథస్తత్ కవయో వదంతి !!
లేవండి! మేలుకోండి! శ్రేష్ఠమైన ఆచార్యులను ఆశ్రయించి ఆ ఆత్మను సాక్షాత్కరించుకోండి. ఆ మార్గం కత్తి మొనలా తీక్షమైంది. దానిని అనుసరించి పోవడం ఎంతో ప్రయాసతో కూడిందని, అనుసరించడం ఎంతో కష్టమని విజ్ఞులు చెపుతారు.
15. అశబ్ద మస్పర్శ మరూపమవ్యయం
తథా రసం నిత్యమగంధ వచ్చయత్!
అనాద్యనంతం మహత: పరం ధ్రువం
నిచాయ్య తన్మృత్యు ముఖాత్ ప్రముచ్యతే!!
శబ్దస్పర్శ రూపరసగంధాలు లేనిదీ, నాశరహితమైనదీ, శాశ్వతమూ, ఆదీ అంతూ లేనిదీ మహత్తుకు అతీతమైనదీ, ధృవమైనదీ అయిన ఆత్మను సాక్షాత్కరించుకుని మృత్యువునుండి మానవుడు విముక్తి పొందుతాడు.
16. నాచికేత ముపాఖ్యానం
మృత్యుప్రోక్తం సనాతనమ్!
ఉక్త్వా శ్రుత్వా చ మేధావీ
బ్రహ్మలోకే మహీయతే!!
యమరాజు చెప్పిన ఈ నాచికేతోపాఖ్యానాన్ని, సనాతనమైన దాన్ని, ఇతరులకు చెప్పి తాను వినిన బుద్ధిశాలి బ్రహ్మలోకంలో ఘనతను పొందుతాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment