Wednesday, 1 July 2020

🌻. కఠోపనిషత్ - 1 🌻

🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 4 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కఠోపనిషత్  -  1 🌻

శాంతిపాఠం :

ఓం సహనావవతు ! సహనౌభువక్తు ! సహవీర్యం కరవావహై !
తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై !!
ఓం శాంతి: శాంతి: శాంతి:   

కఠోపనిషత్తు ప్రథమవల్లి :

1. ఓం ఉశన్ హ వై వాజశ్రవస: సర్వవేదసం దదౌ !
తస్య హ నచికేతా నామ పుత్ర ఆస !!

స్వర్గ ఫలాలను కోరి వాజశ్రవసుడు ఒక యుగంలో తన ఆస్తినంతటిని దానం చేశాడు. అతనికి నచికేతుడనే పేరుగల ఒక పుత్రుడున్నాడు.

2. తం హ కుమారం సంతం దక్షిణాసు !
నీయమానాసు శ్రద్ధా వివేశసో మన్యత !!

బ్రాహ్మణులకు దక్షిణగా ఇవ్వటానికి కానుకలు తీసుకు వస్తూండగా పసివాడే ఐనా నచికేతులో ఒక విధమైనశ్రద్ధ ప్రవేశించింది.

3. పీతోదకా జగ్ధతృణా దుగ్ధదోహ నిరింద్రియా: !
ఆనందా నామతే లోకాస్తాన్ స గచ్ఛతి తా దదత్ !!

ముసలితనంలో ఈనే వయసు దాటిపోయి ఒక గడ్డి తినటానికీ, నీళ్లు తాగటానికీ కూడా శక్తి లేకుండా.. ఉన్నవీ పట్టిపోయి ఎందుకూ పనికిరానివీ ఐన ఈ ఆవులను దానం చేసేవాడు చేరుకునే లోకాలుబొత్తిగా ఆనందం లేనివి.

4. స హోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి !

ద్వితీయం తృతీయం తం హోవాచ మృత్యవే త్వా దదామీతి !!

‘‘తండ్రీ.. నన్ను ఎవరికి ఇవ్వబోతున్నావు?’’ అని అతడు తండ్రిని రెండు మూడుసార్లు అడిగాడు. ఆ ప్రశ్నకి కోపం వచ్చిన తండ్రి ‘‘నిన్ను మృత్యు దేవతైన యముడికి ఇస్తాను’’ అని బదులు పలికాడు.

5. బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమ: !

కిం స్విద్ యమస్య కర్తవ్యం యన్మయా ద్వ కరిష్యతి !!

తండ్రి మాటలు విన్నాక నచికేతుడు తనలోతాను ఇలా అనుకున్నాడు.. చాలామంది శిష్యుల్లో నేను మొదటివాడను. మరికొందరిలో మధ్యముడను. (కానీ ఎన్నడూ నేను ఆఖరివాడుగా రాలేదు. అలాంటప్పుడు ఎందుకు మా తండ్రి నన్ను మృత్యువుకిస్తానన్నాడు) నన్ను యముడికి ఇవ్వటంలో ఆయన ఉద్దేశం ఏమిటి?

6. అనుపశ్య యథాపూర్వే ప్రతిపశ్య తథా పరే !
సస్యమివ మర్త్య: పచ్యతే సస్యమివా జాయతే పున: !!

ప్రాచీనులు ఎలా వర్తించారో జ్ఞాపకం తెచ్చుకో. అలాగే ఇప్పుడు ఇతరులు కూడా ఎలా నడుచుకుంటున్నారో గమనించు. మర్త్యులు ధాన్యంలాగానే పండి రాలిపోతారు. ధాన్యం లాగానే మళ్లీ పుట్టుకొస్తారు.

7. వైశ్వానర: ప్రవిశత్యతిథిర్ర్బాహ్మణో గృహాన్ !
తస్యైతాం శాంతిం కుర్వంతి హర వైవస్వతోదకమ్ !!

సత్యమహిమను గుర్తించినవాడై నచికేతుని తండ్రి చివరికి తన కుమారుని యముని వద్దకు పంపుతాడు. కానీ ఆ సమయంలో యముడు ఇంట్లో లేడు. ఆయన రాకకోసం ఎదురుచూస్తూ నచికేతుడు మూడురోజులు నిద్రాహారాలు లేకుండా ఎదురుచూస్తున్నాడు. యముడు తిరిగివచ్చాక ఆయన భార్యో అనుచరులో ఆయనతో ఇలా అన్నారు. ‘‘బ్రాహ్మణుడైన అతిథి అగ్నిలాగా ఇంట్లో ప్రవేశిస్తాడు. అతనిని సద్గృహస్థులు శాంతింపజేస్తారు. కాబట్టి వైవస్వతుడా నీళ్లు తీసుకురా’’.

8. ఆశాప్రతీక్షే సంగతం సూనృతాం
చేష్టాపూర్తే పుత్రపశూంశ్చ సర్వాన్ !
ఏతద్ వృజ్ క్తే పురుస్వాల్పమేధసో
యస్నానశ్నన్ వసతి బ్రాహ్మణోగృహే !!

బ్రాహ్మణుడు ఏ ఇంట్లో నిరాహారుడుగా వుంటాడో ఆ బుద్ధిహీనుడి ఆశలు మరియు ఆకాంక్షలు సత్సాంగత్య ఫలము సత్య మధురభాషణం వల్ల కలిగిన ఫలమూ సర్వపుణ్యకర్మల ఫలమూ పుత్రులూ పశుసంపదా అంతా కూడా నాశనమయిపోతుంది.

9. త్రిసోరాత్రీర్యద వాత్సీర్గృహే
మే నశ్నన్ బ్రహ్మన్నతిథిర్న మస్య: !
నమస్తే స్తు బ్రహ్మన్ స్వస్తిమే స్తు
తస్మాత్ ప్రతి త్రీన్ వరాన్ వృషీణ్య!!

నచికేతునితో యముడు అతనితో ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణుడా గౌరవింప తగిన నువ్వు అతిథివై నా ఇంట్లో నిరాహారిగా మూడురాత్రులు గడిపావు కాబట్టి వాటికి పరిహారంగా మూడు వరాలు కోరుకో. ఓ బ్రాహ్మణుడా నీకు నమస్కారం. నాకు శుభమగుగాక.

10. శాంతసంకల్ప: సుమనా యథాస్యాద్
వీతమన్యుర్గౌతమో మా భి మృత్యో !
త్వత్ర్పస్పష్టం మా భివదేత్ ప్రతీత:
ఏతత్ త్రయాణాం ప్రథమం వరం వృణే !!

నచికేతుడు ఇలా సమాధానం చెప్పాడు... ఓ మృత్యుదేవా నా తండ్రి ఐనా గౌతముడు నా గురించిన ఆత్రుత తీరినవాడై సంతోషం నిండిన మనస్సుతో నీచే తిరిగి పంపబడిన నన్ను గుర్తించి ఆదరించుగాక. మూడువరాల్లో మొదటిగా నేను కోరే వరం ఇదే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment